Tuesday 25 October 2011

ఆదికవి నన్నయ్య


నన్నయ్య ఎక్కడ జన్మించాడో , తల్లిదండ్రులెవరో ఇంటి పేరు (ఇంటిపేరు "వాడ్రేవువారు" అని అంటుంటారు మేధావులు) ఏమిటో తెలియదు.పూర్వ కవులు చాలా మంది వీటి గురించి పట్టించుకోలేదు. నన్నయ్య ను "నన్నయ్య భట్టు " అని కూడా అంటారు. రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరాన్ని (నేటి రాజమండ్రి ) రాజధానిగా చేసుకుని పరిపాలించిన కాలంలో నన్నయ్య నరేంద్రుని ఆస్థానకవిగా ఉండేవాడు .నన్నయ్య కు "ఆది కవి","వాగనుశాసనుడు" అనే బిరుదులు ఉన్నాయి. నన్నయ్య పాండిత్యం ఎంత గొప్పదో ఆయన రచనలు చెప్పకనే చెబుతాయి.
క్రీ .శ . 11 వ శతాబ్ధానికి చెందిన నన్నయ్య "అంధ్ర మహాభారతమే" కాకుండా "చాముండికా విలాసం", "ఇంద్ర విజయం" అనే కావ్యాలు, "అంధ్ర శబ్ధ చింతామణి" అనే సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని రచించాడని చెప్తారు. "అంధ్ర శబ్ధ చింతామణి" తెలుగు భాష గురించి రాసినదైనా ఎవరు రాసారన్నది వివాదాస్పదం.ఈ రెండు కవ్యాలు నన్నయ్య రాసాడని చెప్పడానికి సరైన ఆధారాలు లేవు.
నన్నయ్య ఆదికవా?
నన్నయ్యకు "ఆదికవి" అనే బిరుదు తర్వాతి కాలంలో వచ్చింది .రామరాజ భూషణుడు "వసు చరిత్ర" అనే కావ్యంలో "మహిమున్ వాగనుశాసనుండు సృజియి౦పన్..." అని పేర్కొన్నాడు . అంటే నన్నయ్య అంధ్ర శబ్ధాన్ని సృష్టించాడు అన్న భావం ఉంది.మారన అనే కవి నన్నయ్య "అంధ్ర కవితా గురుడు" అని కీర్తించాడు. కొలని గణపతి దేవుడనే కవి కూడా నన్నయ్య "అంధ్ర కావ్యపథము తీర్చినవాడ" ని ప్రశంసించాడు. ఈ విధంగా నన్నయ్య ను చాలా మంది "తెలుగు వారికి కవితా భిక్ష పెట్టినవాడు" అని కొనియాడారు. ఆ విధంగా నన్నయ్య "ఆదికవి" గా ప్రసిద్దికెక్కాడు.
నన్నయ్య నిజంగా ఆదికవేనా? అంతకుముందు తెలుగు కవిత్వం లేదా? కవులు లేరా? ఏమీ లేకుండా ఒక్కసారిగా "అంధ్ర మహాభారతం" అనే ఓ మహా కావ్యం వెలువడుతుందా? అంతకుముందు కవులు లేకుండా హఠాత్తుగా నన్నయ్య పుట్టుకొచ్హాడా? నన్నయ్య కు ముందు తెలుగు భాష ఉన్నప్పుడు అంతో ఇంతో కవిత్వం లేకుండా ఉంటుందా?
నన్నయ్య కు పూర్వం శాసనాలు పరిశీలిస్తే పద్య,గద్య రచనలు ఉన్నట్టు తెలుస్తోందని భాషా పండితులు పేర్కొన్నారు. క్రీ.శ. 848 నాటి పండరంగని అద్దంకి శాసనంలో మొదటిసారిగా "తరువోజ" చందస్సులో పద్యం కనబడింది. అ పద్యం తరువాత వచనం ఉంది.అంటే అది చంపూ పద్ధతి లక్షణం! గుణగ విజయాదిత్యుని కాలం నాటి శాసనాలలో సీస పద్యాలు న్నాయి.యుద్ధ మల్లుని బెజవాడ శాసనం(885 ప్రాంతం) లో అయిదు "మధ్యాక్కర" పద్యాలు కనిపించాయి. సాతలూరు శాసనంలో చంపకమాల పద్యం ఉంది.క్రీ.శ.1000 నాటి విరియాల కామసాని గూడూరు శాసనంలో మూడు "చంపకమాల పద్యాలు కనిపిస్తాయి.ఈ పద్యాలు నన్నయ్య పద్యాలను తలపిస్తాయని పరిశీలకుల అభిప్రాయం.
అసలు ఏ భాషలో నైనా మొట్టమొదట దేశి కవిత పుడుతుంది.అంటే జానపద సాహిత్యం ఆవిర్భవిస్తుంది.ఐతే ఇది మౌఖికంగానే ఉంటుంది. పాటలు,పదాలు మొదలైనవన్నీ ప్రజలనోట జీవిస్తూ ఉంటాయి. నన్నయ్యకు ముందు కూదా ఊయల పాటలు, తుమ్మెద పదాలు,గౌడు గీతాలు,గొబ్బి పదాలు,వెన్నెల పదాలు ప్రజల వ్యవహారంలో ఉన్నట్టు ఆధారాలున్నాయి. నన్నయ్య కూడా భారతం లో "నాగీ" గీతాలు పేర్కొన్నాడు.నన్నయ్యకు ముందే "వాంచియార్" అనే తమిళ కవి తెలుగు ఛందో గ్రంథం రాసినట్టు పరిశోధకులు నిర్ధారించారు.
కాబట్టి నన్నయ్యకు ముందే తెలుగు కవిత్వం ఉంది,కవులు ఉన్నారని తెలుస్తోంది. వారిలో శ్రీపతి పండితుడు ప్రసిద్ధుడు.ఇంకా అయ్యనభట్టు,చేతన భట్టు అనే కవులు ఉండేవారు.పద్మ కవి,సర్వదేవుడు జైన కావ్యాలు రాసినట్టు తెలుస్తోంది. కన్నడ కవి పంపడు కూడ అంధ్రుడే అనే అభిప్రాయం బలంగా ఉంది.
మరి నన్నయ్యను ఎందువల్ల "ఆదికవి" గా పేర్కొంటున్నారు?
ఒక మహా కావ్యం రచించగల,గొప్ప కవిత్వం రాయగల,ఒక సాహిత్య మార్గానికీ ,ఒక శైలీ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టగల సామర్థ్యం నన్నయ్యకు ఉండటం వల్లా తరువాతి కవులు ఆయనను అనుసరించుట వల్లా లభ్యమవుతున్న ఆధారాలను బట్టి నన్నయ్యను "ఆదికవి" అంటున్నారు.
నన్నయ్యను వాగనుశాసనుడని కూడా అంటారు.సంస్కృత ఛందస్సుకు తెలుగు దుస్తులు తొడిగాడు.నన్నయ్యను "ఆది కవి" అనటం కేవలం ఒక చారిత్రక అవగాహన కోసమే. ఆయనను గౌరవించటానికి మాత్రమే.అంతే తప్ప "తెలుగునకు ఈనాడు ఎట్టి భావమునైనను,ఎట్టి రసమునైనను మెప్పించు శక్తివంతమైన భాష ఉన్నదనగా అది నన్నయ్య పెట్టిన భిక్ష"అనటం అతిశయోక్తి అనిపించుకుంటుంది.

No comments:

Post a Comment