Wednesday 26 October 2011

బమ్మెర పోతన

కవయిత్రి మొల్ల


క్రీ.శ.15 వ శతాబ్ది చివరి భాగంలో జీవించి ఉండవచ్చని భావిస్తున్న కవయిత్రి మొల్ల రచించిన రామాయణమే "మొల్ల రామాయణం" గా ప్రసిద్ధికెక్కింది.తెలుగులో రెండవ కవయిత్రి మొల్ల(అన్నమయ్య  అర్ధాంగి తాళ్ళపాక తిమ్మక్క తరువాత). మొల్ల అంటే  గ్రామీణ భాషలో అర్థం  "మల్లె".శ్రీ కంఠమల్లేశ్వరుని దయవల్ల కవిత్వం అలవడిందని చెప్పినది.ఈమె నెల్లూరు ప్రాంతానికి చెందినట్లు ఊహిస్తున్నారు.మొల్ల వాల్మీకి రామాయణం ఆధారంగా స్వతంత్రంగా,సంక్షిప్తంగా రామాయణం రచించింది.ఈమె తండ్రి పేరు ఆతుకూరు కేసన శెట్టి.ఆయన శివభక్తిపరుడని,గురులింగ జంగమార్చన పరుడని మొల్ల పేర్కొంది.అందువల్లే ఈమెను "బసవి" అని కూడా  పిలిచేవారని తెలుస్తోంది.మొల్ల  పరమేశ్వరుడే  తన గురువని పేర్కొంది.ఈమెపై పోతన ప్రభావం చాలా  ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. పోతన లాగే ఈమె కూడా శైవురాలైనా విష్ణువును గూర్చి రచనలు చేసింది. ఈమె తన రచనలను పోతన లాగే  రాజులకు అంకితం ఇవ్వలేదు. తన రామాయణాన్ని మొల్ల శ్రీరామచంద్రునికి అంకితం చేసింది.ఈమెకు "ఆంధ్రభోజుడు" శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలో తను రాసిన రామాయణాన్ని వర్ణించే అవకాశం వచ్చిందని  చెప్తారు.ఈమె అవసాన దశలో "శ్రీశైల మల్లిఖార్జును"ని సేవిస్తూ గడిపిందని భావిస్తున్నారు.
"ఉన్నాడు లెస్స రాఘవు
డున్నాడిదె కవుల గూడియురు గతిరానై
యున్నాడు నిన్ను గొనిపో
నున్నడిది నిజము నమ్ముముర్వీతనయా"
ఈ పద్యం మొల్ల ప్రతిభకి గీటురాయి.సీతకు రాముని గురించి ఆందోళన ఉంది.దానిని పోగొట్టటానికి "నేను రాముడ్ని చూసివచ్చాను" అని చెప్పాలి. కాని మొల్ల పాత్రౌచిత్యంతో క్రియతో ప్రారంభించి "ఉన్నాడు  లెస్స..." అనటం అమె కవితా నైపుణ్యమే.శ్రీరాముడితో చెప్పేటప్పుదు కూడా హనుమంతుని నోట మొల్ల "కంటిన్ జానకిబూర్ణచంద్రవదనన్ గల్యాణినా లంకలో" అనిపించటంలో ఎంత ఔచిత్యం ఉందో తెలుస్తుంది.
హనుమంతుడు లంకనుంచి సీతను తీసుకుని వెళ్ళిపోతాను అని ఆవేశంగా  అన్నాడు. హనుమంతుని ఆత్రుత అటువంటిది.కాని అది సముచితమా అని ఆలోచించగల మనస్థైర్యం గలది సీత.అందుకే ఆ విధంగా తీసుకెళ్తే "రావణుకన్న మిక్కిలి భూవరుడే దొంగయండ్రు"అని సర్ధిచెప్పింది.
మొల్ల కేవలం వాలీకి రామాయణాన్ని మాత్రమే అనుసరించలేదని ఆధ్యాత్మ రామాయణం,భాస్కర రామాయణాలను అనుసరించి మనోహరమైన కల్పనలు చేసిన విషయాన్ని "సమగ్రాంధ్ర సాహిత్యం" లో ఆరుద్ర గారు చక్కగా  వివరించారు.
మొల్ల భాస్కర రామాయణాన్ని అనుసరించి కొన్ని చేర్పులు,మార్పులు చేసి తన ప్రతిభకు సానపట్టినట్లు చేసుకొన్నది. పరశురాముడు "రాముడున్ గీముండనుచు"అనటం, "శివుని చివుకు విల్లు" అనడం మొల్ల శబ్ధ వైచిత్రికి తార్కాణం.మొల్లకి కవిత్వం  ఏ విధంగా చెప్పాలో  తెలుసు.ఏ విధంగా చెప్పకూడదో  అంతకంటే బాగా తెలుసు. 

"కందువమాటలు సామెత
లందముగా గూర్చి చెప్ప నది తెలుగునకుం
పొందై  రుచియై వీనుల
విందై మఱి కానిపించు విబుధుల "  
అని పేర్కొన్న మొల్ల ఆ పొందును,వీనుల విందును రామాయణం ద్వారా  తెలుగు వారికి రుచి చూపించింది.తెలుగు కవయిత్రులలో  అద్వితీయురాలు మొల్ల. 

 మరికొంత సమాచారం:
  • "కథానాయిక మొల్ల" పేరుతో మొల్ల పై  1970 లో  ఓ  చిత్రం వచ్చింది.పద్మనాభం గారు  నిర్మించిన ఈ చిత్రం లో వాణీశ్రీ  గారు   మొల్ల పాత్రలో అద్భుతంగా  నటించారు.
  • "మొల్ల రామాయణం" ఈ క్రింది లింకు ద్వారా ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు    
        http://www.mediafire.com/?dru0ubgktio5is6



  

ఎఱ్ఱన్న

సుమారు క్రీ.శ.1280-1360 ప్రాంతం నాటి ఎర్రన్న ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి.గురువైన శంకరస్వామి వల్ల ఎర్రన్న కూడా శివభక్తుడై "శంభుదాసుడు" అనే బిరుదు పొందాడు.వేగినాడులోని కరాపర్తి గ్రామంలోనో,పాకనాడులోనో,గుడ్లూరులోనో ఎర్రన్న జీవించి ఉంటాడు.ఈయనకు "ప్రబంధ పరమేస్వరుడు" అనే బిరుదు కూడా ఉంది.ఎర్రన్న రామాయణం,హరివంశం,భారతంలో అరణ్యపర్వ శేషం ,నృసింహపురాణం రచించాడు.
ఎర్రన్న "కవిత్రయం" లో ఒకడనీ,మహాభారత రచనలో నన్నయ్య వదలిన అరణ్య పర్వంలోని మిగిలిన భాగాన్ని పూరించాడనీ మనకు తెలిసిన విషయమే.ఇది రూఢిగా ప్రసిద్ధికెక్కింది.
కాని పూర్వం పండితులు ఈ విషయమై వాదోపవాదాలు చేశారు.
  • నన్నయ్య మూడు పర్వాలను రచించి ఉంటాడు.దీనికి చూపించే ఆధారాలు-
    తిక్కన "అందాది దొడంగి మూడు కృతులాంధ్ర కవిత్వ విశారదుండు విద్యాదయి తుండొనర్చె మహితాత్ముడు నన్నయ్య భట్టుదక్షతన్"అని నన్నయ్య మూడు పర్వాలూ రాసినట్టు చెప్పడం.
    మారన  భారత సంహితన్ మును  ద్రిపర్వములెవ్వడొనర్చెనట్టి....నన్నయ్య భట్టు గొల్చెదన్" అని మార్కండేయ పురాణంలో పేర్కొన్నాడు.కాబట్టి   నన్నయ్య మూడు పర్వాలూ రాసి ఉంటాడు,చివరి భాగం శిథిలమై(తాటాకులు కదా!) వుంటే,ఆ శిథిలభాగాన్నిపూరించి ఉంటాడు-అని ఒక వాదం.
    కానీ నన్నయ్య తాళపత్ర గ్రంథం కేవలం ఒక ప్రతిమాత్రమే ఉండదు.చాలా ప్రతులు ప్రచారంలో ఉండగా ఒకేవిధంగా అన్ని ప్రతులూ శిథిలమవుతాయా?తిక్కన,మారన మూడు పర్వాలు రచించాడని స్థూలంగా చెప్పారు తప్ప రెండున్నర పర్వాలని ఎవరూ చెప్పరు.అలా శిథిలమైన భాగాన్ని పూరించివుంటే ఎర్రన్న ఆ విషయాన్ని పేర్కొనేవాడు కదా!-ఈ విధంగా పై వాదాన్ని ఖండించారు.
  •  నన్నయ్య మూడు పర్వాలూ పూర్తి చేయటం వల్లనే తిక్కన విరాట పర్వం నుంచి మొదలుపెట్టాడు .లేకపోతే తిక్కన అరణ్యపర్వశేషం  నుంచే రచన ప్రారంభించేవాడు కదా!నన్నయ్య సగం రచించి మరణించినప్పుడు ఆ మిగిలిన భాగం నుంచి మొదలుపెట్టడం అనేది కీడుగా భావించి తిక్కన అక్కడి నుంచి ప్రారంభించి  ఉండకపోవచ్చు.పైగా తిక్కనకు  కథలతో కూడుకొన్న విరాటపర్వం నుంచి రచన ప్రారంభించాలన్న ఉత్సుకత కూడా ఉంది.కాబట్టి తిక్కన అరణ్యపర్వ శేషరచనకి పూనుకోలేదని కొందరు వాదించారు.
  • నృసింహ పురాణంలో ఎర్రన  తాతగారైన ఎర్రపోత సూరి చెప్పినట్టుగా కనిపిస్తోన్న పద్యం ఇది.
"ఉన్నత సంస్కృతాది చతురోక్తి పథంబుల కావ్యకర్తవై
ఎన్నికమై ప్రబంధ పరమేశుడనంగ నరణ్య పర్వశే
షోన్నయ మంధ్రభాష సుజనోత్సవ మొప్పగ నిర్వహించితా
నన్నయభట్టు తిక్క కవినాథుల కెక్కిన భక్తి పెంపునన్
"
ఇందులో "ఉన్నయము" అంటే ఉద్ధరణ లేదా  పూరణ.కాబట్టి ఈ పూరణం ఎటువంటిది?అనే సందేహంతో చర్చలు చేసారు.పైన చెప్పిన కారణాల  వల్ల  నన్నయ్య రాయకుండా మిగిలిన భాగాన్నే పూరించాడనటం సముచితమని ఎక్కువమంది అంగీకరించారు. 
  •  తిక్కనలాగా మరి ఎర్రనకి "కీడు" కలగలేదా?తిక్కనకే ఆ నమ్మకం ఉందా?అన్నది మరొక ప్రశ్న.అందుకే ఎర్రన తన రచనగా కాకుండా-నన్నయ పేరు మీదుగానే రచించాడని సమాధానం.మరొక విధంగా చెప్పాలంటే  ఎర్రన వల్లనే  మనకు భారతం పూర్తిగా లభించింది.


    Tuesday 25 October 2011

    తిక్కన సోమయాజి


    "కవి బ్రహ్మ" ,'ఉభయకవిమిత్రుడు" అనే బిరుదులు గల తిక్కన క్రీ.శ.1210-1290 మధ్య కాలంలో జీవించాడని చరిత్రకారులు నిర్ణయించారు .అంటే 13 వ శతాబ్దికి చెందినవాడు.తిక్కన తాత "భాస్కరుడు".మనుమసిద్ధి ఆస్థానకవిగా ప్రసిద్ధుడైన తిక్కన యజ్ఞం చేయటం వల్ల "సోమయాజి"గా పేరొందాడు.మనుమసిధ్హికి మంత్రిగా కూదా తిక్కన పనిచేశాడు.తిక్కన శిష్యుడైన "మూలఘటిక కేతన" రాసిన "దశకుమార చరిత్ర"లో తిక్కనకు సంబంధించిన వివరాలున్నాయి. తిక్కన ఇంటి పేరు "కొట్టరువు".తండ్రిపేరు "కొమ్మన దండనాథుడు".
    తిక్కన "నిర్వచనోత్తర రామాయణం', "అంధ్ర మహాభారతం" రచించాడు. పదిహేను పర్వాలను ఒక్క చేతిమీదుగా రచించిన ప్రతిభాశాలి తిక్కన.అంధ్ర మహాభారతాన్ని "హరిహరనాథుడి"కి అంకితమిచ్చాడు.
    అంధ్ర మహాభారతం,నిర్వచనోత్తర రామాయణం కాకుండా తిక్కన "విజయసేనం,"కవిసార్వభౌమచ్ఛందస్సు" ,"కృష్ణశతకం"  కూడా రచించినట్లు చెప్తారు."విజయసేనం" లోని కొన్ని పద్యాలు మాత్రమే లభ్యమవుతున్నాయి.మిగిలిన రచనలు దొరకలేదు.తిక్కన తన భారతాన్ని నరాంకితం చేయడానికి  ఇష్టపడలేదు.హరిహరనాథుడే  తనను అడిగి   కృతి పొందాడని చెప్పే ఈ పద్యంలో తిక్కన అంధ్రాభిమానం వ్యక్తమవుతుంది. 
    "తెనుగుబాస వినిర్మింప దివురుటరయ
    భవ్యపురుషార్థ తరుపక్వ ఫలముగాదె
    దీనికెడ   నియ్యకొని వేడ్కనూనికృతి  ప
    తిత్వమర్థించి వచ్చితి తిక్కశర్మ "
    తిక్కన నన్నయ్యను తన గురువువలె భావించాడు."విద్యాదయితుడు"గా "మహితాత్ము"నిగా ప్రశంసించినా  తనదైన కవితా పంథా ఉండాలని భావించాడు.
    తిక్కన ఆంధ్రాభిమానం చాలా గొప్పది.నన్నయ్య సంస్కృత  పదాలను ఎక్కువగా వాడాడు.ఆ రోజుల్లో సంస్కృఇతానికి  తప్ప తెలుగుకు ఆదరణ లేదు. తెలుగు భాషకి గౌరవం,ఆదరణ కల్పించడం కోసం తిక్కన ఈ విధంగా శపథం చేసాడు. 

    "ఔత్యము గామి నొప్పయిన సంస్కృఈతమెయ్యడ  జొంప వాక్యాసాం
    గత్యము సేనబోనయిన గద్యముతోదుగ జెప్పి పెట్ట దౌ
    ర్గత్యముదోప బ్రాసముప్రకారము వేఱగు
    నక్షరంబులన్
    శ్రుత్యను రూపమంచునిడ నూరుల  కివ్విధమింపు బెంపదే "   
    కొందరుకవులు  వాడిన మాటల్నే  వాడుతూ అది తమ నేర్పుగా చెబుతూ ఉంటారు .అటువంటి రచన నిరర్ద్ధకమంటూ   తిక్కన నిష్కర్షగా,కొంచెం  కోపంగా ప్రకటించాడు.
    తిక్కన మహాభారతం అనువాదంలా కాకుండా స్వతంత్ర కావ్యంలా భాసిస్తుంది.తెలుగుదనం ఉట్టిపడుతుంది.దానికి కారణం తిక్కన ఆంధ్రాభిమానం.తెలుగు భాషకి గౌరవం కల్పించి,భారతంలోని  పాత్రలను  తెలుగువారికి  సన్నిహితం చేసి అసలైన  తెలుగుభారతాన్ని అందించాడు.
    "తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి"అని తెలుగు వారు అనడానికి ముఖ్య కారణం తిక్కన  శైలే .తిక్కన కాక మరెవరు  రాసి ఉండినా తెలుగు వారికి మహాభారతం ఇంత ప్రీతిపాత్రం అయిఉండేదికాదని అనడంలో తప్పులేదు. 

      

    ఆదికవి నన్నయ్య


    నన్నయ్య ఎక్కడ జన్మించాడో , తల్లిదండ్రులెవరో ఇంటి పేరు (ఇంటిపేరు "వాడ్రేవువారు" అని అంటుంటారు మేధావులు) ఏమిటో తెలియదు.పూర్వ కవులు చాలా మంది వీటి గురించి పట్టించుకోలేదు. నన్నయ్య ను "నన్నయ్య భట్టు " అని కూడా అంటారు. రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరాన్ని (నేటి రాజమండ్రి ) రాజధానిగా చేసుకుని పరిపాలించిన కాలంలో నన్నయ్య నరేంద్రుని ఆస్థానకవిగా ఉండేవాడు .నన్నయ్య కు "ఆది కవి","వాగనుశాసనుడు" అనే బిరుదులు ఉన్నాయి. నన్నయ్య పాండిత్యం ఎంత గొప్పదో ఆయన రచనలు చెప్పకనే చెబుతాయి.
    క్రీ .శ . 11 వ శతాబ్ధానికి చెందిన నన్నయ్య "అంధ్ర మహాభారతమే" కాకుండా "చాముండికా విలాసం", "ఇంద్ర విజయం" అనే కావ్యాలు, "అంధ్ర శబ్ధ చింతామణి" అనే సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని రచించాడని చెప్తారు. "అంధ్ర శబ్ధ చింతామణి" తెలుగు భాష గురించి రాసినదైనా ఎవరు రాసారన్నది వివాదాస్పదం.ఈ రెండు కవ్యాలు నన్నయ్య రాసాడని చెప్పడానికి సరైన ఆధారాలు లేవు.
    నన్నయ్య ఆదికవా?
    నన్నయ్యకు "ఆదికవి" అనే బిరుదు తర్వాతి కాలంలో వచ్చింది .రామరాజ భూషణుడు "వసు చరిత్ర" అనే కావ్యంలో "మహిమున్ వాగనుశాసనుండు సృజియి౦పన్..." అని పేర్కొన్నాడు . అంటే నన్నయ్య అంధ్ర శబ్ధాన్ని సృష్టించాడు అన్న భావం ఉంది.మారన అనే కవి నన్నయ్య "అంధ్ర కవితా గురుడు" అని కీర్తించాడు. కొలని గణపతి దేవుడనే కవి కూడా నన్నయ్య "అంధ్ర కావ్యపథము తీర్చినవాడ" ని ప్రశంసించాడు. ఈ విధంగా నన్నయ్య ను చాలా మంది "తెలుగు వారికి కవితా భిక్ష పెట్టినవాడు" అని కొనియాడారు. ఆ విధంగా నన్నయ్య "ఆదికవి" గా ప్రసిద్దికెక్కాడు.
    నన్నయ్య నిజంగా ఆదికవేనా? అంతకుముందు తెలుగు కవిత్వం లేదా? కవులు లేరా? ఏమీ లేకుండా ఒక్కసారిగా "అంధ్ర మహాభారతం" అనే ఓ మహా కావ్యం వెలువడుతుందా? అంతకుముందు కవులు లేకుండా హఠాత్తుగా నన్నయ్య పుట్టుకొచ్హాడా? నన్నయ్య కు ముందు తెలుగు భాష ఉన్నప్పుడు అంతో ఇంతో కవిత్వం లేకుండా ఉంటుందా?
    నన్నయ్య కు పూర్వం శాసనాలు పరిశీలిస్తే పద్య,గద్య రచనలు ఉన్నట్టు తెలుస్తోందని భాషా పండితులు పేర్కొన్నారు. క్రీ.శ. 848 నాటి పండరంగని అద్దంకి శాసనంలో మొదటిసారిగా "తరువోజ" చందస్సులో పద్యం కనబడింది. అ పద్యం తరువాత వచనం ఉంది.అంటే అది చంపూ పద్ధతి లక్షణం! గుణగ విజయాదిత్యుని కాలం నాటి శాసనాలలో సీస పద్యాలు న్నాయి.యుద్ధ మల్లుని బెజవాడ శాసనం(885 ప్రాంతం) లో అయిదు "మధ్యాక్కర" పద్యాలు కనిపించాయి. సాతలూరు శాసనంలో చంపకమాల పద్యం ఉంది.క్రీ.శ.1000 నాటి విరియాల కామసాని గూడూరు శాసనంలో మూడు "చంపకమాల పద్యాలు కనిపిస్తాయి.ఈ పద్యాలు నన్నయ్య పద్యాలను తలపిస్తాయని పరిశీలకుల అభిప్రాయం.
    అసలు ఏ భాషలో నైనా మొట్టమొదట దేశి కవిత పుడుతుంది.అంటే జానపద సాహిత్యం ఆవిర్భవిస్తుంది.ఐతే ఇది మౌఖికంగానే ఉంటుంది. పాటలు,పదాలు మొదలైనవన్నీ ప్రజలనోట జీవిస్తూ ఉంటాయి. నన్నయ్యకు ముందు కూదా ఊయల పాటలు, తుమ్మెద పదాలు,గౌడు గీతాలు,గొబ్బి పదాలు,వెన్నెల పదాలు ప్రజల వ్యవహారంలో ఉన్నట్టు ఆధారాలున్నాయి. నన్నయ్య కూడా భారతం లో "నాగీ" గీతాలు పేర్కొన్నాడు.నన్నయ్యకు ముందే "వాంచియార్" అనే తమిళ కవి తెలుగు ఛందో గ్రంథం రాసినట్టు పరిశోధకులు నిర్ధారించారు.
    కాబట్టి నన్నయ్యకు ముందే తెలుగు కవిత్వం ఉంది,కవులు ఉన్నారని తెలుస్తోంది. వారిలో శ్రీపతి పండితుడు ప్రసిద్ధుడు.ఇంకా అయ్యనభట్టు,చేతన భట్టు అనే కవులు ఉండేవారు.పద్మ కవి,సర్వదేవుడు జైన కావ్యాలు రాసినట్టు తెలుస్తోంది. కన్నడ కవి పంపడు కూడ అంధ్రుడే అనే అభిప్రాయం బలంగా ఉంది.
    మరి నన్నయ్యను ఎందువల్ల "ఆదికవి" గా పేర్కొంటున్నారు?
    ఒక మహా కావ్యం రచించగల,గొప్ప కవిత్వం రాయగల,ఒక సాహిత్య మార్గానికీ ,ఒక శైలీ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టగల సామర్థ్యం నన్నయ్యకు ఉండటం వల్లా తరువాతి కవులు ఆయనను అనుసరించుట వల్లా లభ్యమవుతున్న ఆధారాలను బట్టి నన్నయ్యను "ఆదికవి" అంటున్నారు.
    నన్నయ్యను వాగనుశాసనుడని కూడా అంటారు.సంస్కృత ఛందస్సుకు తెలుగు దుస్తులు తొడిగాడు.నన్నయ్యను "ఆది కవి" అనటం కేవలం ఒక చారిత్రక అవగాహన కోసమే. ఆయనను గౌరవించటానికి మాత్రమే.అంతే తప్ప "తెలుగునకు ఈనాడు ఎట్టి భావమునైనను,ఎట్టి రసమునైనను మెప్పించు శక్తివంతమైన భాష ఉన్నదనగా అది నన్నయ్య పెట్టిన భిక్ష"అనటం అతిశయోక్తి అనిపించుకుంటుంది.